తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్‌గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇది సింగరేణి చరిత్రలో మహిళలకు ప్రత్యక్షంగా మైనింగ్ ఆపరేషన్‌లో భాగంగా చేరే తొలిసారి అవకాశం అని యాజమాన్యం పేర్కొంది. సింగరేణి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం మాట్లాడుతూ, మైనింగ్ రంగంలో మహిళల సాధికారతను పెంపొందించడం, సమాన అవకాశాలను కల్పించడం, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలకు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి, కనీసం ఏడవ తరగతి పాసు ఉండాలని యాజమాన్యం సూచించింది. అలాగే, శారీరకంగా సామర్థ్యం కలిగి ఉండాలి, ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆగస్టు 2024కి ముందే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తులు సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతి లేదా జనరల్ మేనేజర్ వద్ద సమర్పించవచ్చని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
దరఖాస్తులను స్వీకరించిన తర్వాత, జనరల్ మేనేజర్ సీపీపీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ అభ్యర్థులను పరిశీలించి కనీస అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్‌లో శిక్షణ పొందాలి. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఖాళీల లభ్యతను బట్టి నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని సీనియర్ ఎపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ-5 డిసిగ్నేషన్‌తో సంబంధిత ఏరియాలకు నియమిస్తారు.
సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం ద్వారా మహిళా ఉద్యోగులకు మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం, సమాన అవకాశాలు మరియు సామర్థ్య ప్రదర్శనకు మద్దతుగా నిలిచే విధంగా ముందుకు వచ్చినట్టు స్పష్టం చేసింది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరుతోంది.
India’s Big Sports Day: క్రికెట్‌లో పాక్.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్‌కు డబుల్ ‘పరీక్ష’..!