ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మృతిపై హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో కలిసి వేసిందన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జాతీయవాదం, దేశ భక్తి మరియు మానవతా విలువలకు మారుపేరుగా నిలిచిన గొప్ప గేయ రచయిత అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వారి మరణ వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినీ పాటలు రాయడమే గాక ఆధ్యాత్మిక విలువలను, ధార్మిక విలువలను పాటించేవారని, వారితో తనకు మూడు దశాబ్దాల సన్నిహిత స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు.
వారు తనతో ఎంతో ఆత్మీయత ప్రేమాభిమానాలతో మెలిగేవారని, పద్మశ్రీ అందుకున్నప్పుడు వారి స్వగృహంలో కలిసి సన్మానించినప్పుడు వారు చాలా సంతోషించారని బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిలాంటి సన్నిహితుణ్ణి కోల్పోవడం బాధాకరమని, వారి మృతి తెలుగు సినీ రంగానికే గాక సాహితీ లోకానికి తీరని లోటు అని, వారి మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిచేకూర్చాలని ప్రార్థిస్తున్నట్టు దత్తాత్రేయ పేర్కొన్నారు. వారి కుటుంబానికి ఈ కష్టకాలంలో బాధను తట్టుకోవడానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు.