Bus Stuck in Flood: మహబూబాబాద్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నారు. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ కొత్తచెరువు కూడా జోరుగా అలుగు పారుతోంది. ఈ నేపథ్యంలో పెనుప్రమాదం తప్పింది. మరోసారి జోరుగా వర్షం కురవటంతో.. వరద ఎక్కువైంది. రోడ్డుపై నుంచి మోకాలి ఎత్తుతో నీరు వెళ్తోంది. ఈ విషయం తెలియని తొర్రూర్ నుంచి వస్తున్న ఆర్యభట్ట పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో అదే దారి వెంట వెళ్లగా.. ప్రమాదవశాత్తు అలుగు మధ్యలో చిక్కుకుపోయింది.
Hyderabad High Alert: హైదరాబాద్ కు కుంభవృష్టి.. హై అలర్ట్
వరద ప్రవాహం భారీగా ఉండడంతో దారి సరిగ్గా తెలియక బస్సు టైరు వంగిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును అక్కడే ఆపేశాడు. బస్సును వెనక్కి తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టైర్లు మునిగే వరకు వచ్చిన ప్రవాహాన్ని చూసి చిన్నారులు భయంతో అరిచారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చిన్నారులను హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల సాహసం చేయడం వల్లే తృటిలో ప్రమాదం తప్పిందని పలువురు తెలిపారు.