Heavy Traffic: రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ఉపాధి నిమిత్తం సొంత ఊరు వదిలి వెళ్లేవారు, ఎక్కడో ఉంటున్న వారు సంక్రాంతి పండుగకే సొంత ఊరు చేరుకుంటారు. తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటారు. ఏడాదికి సరిపడా జ్ఞాపకాలను వదిలి తిరుగు ప్రయాణం చేస్తారు. సంక్రాంతి సందర్భంగా బస్సులు, రైళ్ల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొందరు పండుగకు రెండు, మూడు నెలల ముందే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. సంక్రాంతి సందర్భంగా రోడ్లు, టోల్ ప్లాజాలు గ్రామస్తులతో కిటకిటలాడాయి. సంక్రాంతి సందర్బంగా భాగ్యనగరంలో మకాం వేసిన ఆంధ్రా ప్రజలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైల్వేలో ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో లేవు. అంతేకాదు తెలంగాణలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో చాలామంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రయివేటు బస్సుల్లో కూడా రద్దీ పెరిగింది.
Read also: New Kind of Fraud: కొత్త తరహా మోసం.. దొంగతనం చేస్తారు ఓఎల్ఎక్స్‌లో అమ్ముతారు
కొంత మంది సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్లాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్ ప్లాజాల వద్ద కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండుగ కావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలు, ఏపీకి వెళ్లే నగరవాసుల వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో నిలుస్తున్నాయి. చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఫాస్టాగ్ ఉన్నా టోల్ ప్లాజా వద్ద వాహనాలు వేగంగా వెళ్లడం లేదు. దానికి తోడు ఉదయం పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పండుగ కారణంగా శుక్రవారం రాత్రి వరకు 50 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని జీఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. దాదాపు ఏపీకి వెళ్లే వరకు ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఇలా వెళ్తే పండగ ముగిశాక ఇళ్లకు చేరుకుంటామని రోడ్డుపై ట్రాఫిక్‌కు గురై పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bhogi Fest: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు