Bus Accident: చేవెళ్లలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన మరిచిపోక ముందే, సంగారెడ్డి జిల్లాలో మరో ఆర్టీసీ బస్సుకి ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ నుంచి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వరకు వస్తోంది. ముత్తంగి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయే క్రమంలో, బ్రేక్ పడకపోవడంతో బస్సు నియంత్రణ కోల్పోయింది. దీంతో బస్సు వేగంగా డివైడర్ ఎక్కి, పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, కండక్టర్ లక్ష్మయ్యతో పాటు కొందరి ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
Read Also: Mumbai: పట్టాలు తప్పిన మోనోరైలు.. గాల్లో మొదటి కోచ్ (వీడియో)
ఇక, సమాచారం అందుకున్న వెంటనే పటాన్‌చెరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక లోపమే కారణమా?.. లేదా డ్రైవర్ అతి వేగమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా తమ బస్సుకు సాంకేతిక లోపాలు ఉన్నాయని డ్రైవర్ లక్ష్మయ్య ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలిపినట్లు తెలుస్తుంది. బ్రేకుల్లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.