హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి వరాల జల్లు కురిపిస్తానని ప్రకటన చేసిన మోదీ.. ఇక్కడికొచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వీరయ్య విమర్శించారు. చిల్లర రాజకీయాలకు బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం, టిఆర్ఎస్ పార్టీ మీదున్న అక్కసును వెళ్ళగక్కడానికే హైదరాబాద్ పర్యటనని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు రాష్ట్రం కోసం ఏం చేశారని ప్రశ్నలు సంధిస్తే.. అందుకు సమాధానం ఇచ్చే స్థితిలో మోదీ లేరని వీరయ్య అన్నారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజ్ కానీ, ప్రాజెక్టులకు గానీ, తెలంగాణ ఇవ్వాల్సిన రైల్వే కొచ్ ప్యాక్టరీ గానీ ఇవ్వకుండా.. వాటిని మంగళం పాడిన ఘనత మోదీదేనని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి పన్నులు కట్టించే డబ్బుల్లో వాటా వస్తుందో లేదో లెక్కలతో సహా చెప్పినప్పటికీ.. వాటిని సమాధానం చెప్పకుండా టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారే తప్ప నామినేటెడ్ పదవులతో రాలేదన్నారు.
తెలంగాణ పథకాలు యావత్తు భారతదేశం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణ రాష్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వీరయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో.. గతంలో మీరు పరిపాలించిన గుజరాత్‌లో చేశారా? పోనీ తెలంగాణలో ఉన్న పథకాలకి కేంద్రం నుంచి నయా పైగా ఇచ్చారా? అంటూ నిలదీశారు. పొత్తులు పెట్టుకున్న ఘనత బీజేపీదేనని చెప్పిన సండ్ర వెంకట వీరయ్య.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కాదు కదా, డిపాజిట్లు కూడా రావని వెల్లడించారు.