ఈ నెల 7వ తేదిన ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. అయితే నేడు చివరి రోజు సభలో సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. 111 జీవోను ఎత్తివేస్తామని వెల్లడించారు. దీంతో సీఎం కేసీఆర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 111 జీవో ఎత్తివేస్తామన్న సీఎ కేసీఆర్ నిర్ణయం ఎంతో హర్షనీయమైందన్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాల ప్రజల తరుపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవో ఎత్తివేతకు సంభందించి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించటం స్వాగతించదగ్గ పరిణామమని ఆమె పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, న్యాయ పరమైన ఇబ్బందులు అధిగమించి దశల వారీగా జీవో సడలింపు చేపడతామని కేసీఆర్ ప్రకటించటం ఆనందించే విషయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల ప్రజలకు కేసీఆర్ ప్రకటన ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.