కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శల దాడులకు దిగారు. గురువారం శంకర్‌పల్లిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ ధ్వజమెత్తారు. రైతుల మేలు కోరి తెలంగాణలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందన్నారు. మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి రైతుల పై ఆర్థిక భారం మోపారన్నారు. కేంద్రం వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ధరలు తగ్గించకుంటే అడుగడుగునా బీజేపీ నేతలను అడ్డుకుంటామాని ఆమె తెలిపారు.
ఇప్పటికే వరుసగా పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతూ పోతూ రైతులతో పాటు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గ్యాస్ ధర గుది బండగా మారింది..నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేశారన్నారు.. రైతు కల్లాల దగ్గరకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తే నల్లా చట్టాలు తెచ్చి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీసిందని ఆరోపించారు.. కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వకున్న మూడేళ్ళ కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెంచి చెరువులు, కుంటలు బోరు బావుల్లో జలకళ సంతరించుకునేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. రైతును రాజు చేయటానికి, రాష్ట్రంలో సమస్యలు లేకుండా చేయడానికి సీఎం ఆలోచిస్తుంటే కేంద్రం సమస్యలు ఎలా సృష్టించాలా అని చూస్తోందని ఆరోపించారు.
read Also: కేసీఆర్ జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దేశ,రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి ప్రధానికి ఉత్తరం రాశారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి ఎరువుల ధరలు తగ్గించేలా చూడాలన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు వడ్లు కొనుగోలు చేయమంటే సప్పుడు చేయరు…అనవసర రాజకీయాలు మాత్రం చేస్తారని విరుచుకుపడ్డారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు బీజేపీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకుంటా యన్నారు. నల్లధనం తెచ్చి ఖాతాల్లో వేస్తామన్న మోడీ గారు ఆ డబ్బులు ఎక్కడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలన్నారు.
Read Also: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం
సీఎం పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదన్నారు. ఎంపీలుగా ఇప్పటి వరకు మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వరి పంటలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి తెలంగాణ రైతన్నలు పంజాబ్ రైతులను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి వచ్చారని గుర్త చేశారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏడాది ఉచిత విద్యుత్ పై తెలంగాణ ప్రభుత్వం 10వేల కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. ప్రతి ఏటా ఎకరాకు 10 వేలు ఎలాంటి ఫైరవీలు,సిఫార్సులు లేకుండా ఇప్పటివరకు 50 వేల కోట్లు రైతులకు అందించిన గొప్ప ప్రభుత్వం మాది…మా పథకాన్ని కాపీ కొట్టి మేము ఇస్తున్న దాంట్లో సగం కూడా ఇవ్వడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.