బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తొలిరోజే టార్గెట్ చేశారు.. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్న ఆయనకు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకొనే దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ ద్వారా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వారి కోసమే పదవి వదులుకున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాంటే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని.. కేవలం పాలకులే ఉంటారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే.. ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారే నిర్ణయించుకునేలా చేయాలన్నారు ప్రవీణ్ కుమార్.
ఇక, సీఎం కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్.. ఇక్కడికి వస్తున్న సోదరులను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని.. అయినా మా బిడ్డలు ఆగరని ఆయన అన్నారు. సారో.. ఎక్కడున్నరు.. మాబిడ్డలు ఆగరు.. అంటూ కేసీఆర్‌ని ఉద్దేశించి సెటైర్లు వేశారు.. మరోవైపు.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఈ మాజీ ఐపీఎస్.. కార్ల షెడ్డులో ఉండి చదువుకుని ఐపీఎస్‌ను త్రుణప్రాయంగా ఎందుకు వదిలేసినవ్ అని కొందరు అడిగిన్రు. మా అమ్మకి చెప్పలేదు నేను.. వచ్చి అడిగింది.. ఎందుకురా వదిలేసినవ్ అని. మనం ఇంకా బానిసలుగా బతుకుతున్నం. కూలీకి పోతేనే జరిగేది. ఏంది బిడ్డా ఇట్ల చేసినవ్ అని అడిగింది. మా అమ్మకు చెప్పా.. ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాదు.. లక్షల మంది బిడ్డల భవిష్యత్తు బాగు చేయాలంటే త్యాగాలు చేయాలని చెప్పి వచ్చా. ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలున్నాయి. వాళ్లందరి కోసమే నేనొస్తున్నా అని చెప్పి వచ్చానని తెలిపారు.. ఇక, కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. రాజ్యాధికార సంకల్ప సభలో ఆయన బహుజన సమాజంలో మనం బానిసలం కాదు పాలకులమని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ జన సునామీని ఎవరూ ఆపలేరని చెప్పారు.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కింది వీడియోను క్లిక్ చేసి చూడొచ్చు.