రాబోయే రోజుల్లో ఏనుగునెక్కి అసెంబ్లీకి వెళ్తాం.. ఇదే ఊపును కొనసాగిస్తూ ప్రగతిభవన్‌ను కూడా హస్తగతం చేసుకుంటాం అని వ్యాఖ్యానించారు బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఎస్పీ సమీక్షా సమావేశానికి వెళ్తూ జడ్చర్లలో ఆగిన ఆయన.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వివిధ పార్టీల్లో దగాపడ్డ వేలాది ప్రజలు ఆ జండాలను చెత్తకుండిల్లో పడేసి కాన్షిరాం చూపిన బాటలో నడవడానికి నీలిరంగు జెండావైపు వస్తున్నారన్నారు. ఇంత చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్న తెలంగాణ మరియు ఉమ్మడి పాలమూరు అక్కా చెళ్లెళ్లకు, అన్నాతమ్ముళ్ళకు ధన్యవాదాలు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాగా, ఐపీఎస్ అధికారి పదవికి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరిన ఆయన.. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ.. ఓ వైపు సమస్యలపై ఫోకస్ పెడుతూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు.