Rohit Chaudhary Sudheer Reddy Predicts Palvai Sravanthi Win In Munugode Elections: నేను 20 రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో తిరుగుతున్నానని.. ఈ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయమని ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి నమ్మకం వెలిబుచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ఒకరు రూ. 150 కోట్లు పెడితే.. మరొకరు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందని.. ఖర్చు విషయంలో ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోందన్నారు. గ్రౌండ్‌లో ఆ రెండు పార్టీలపై నమ్మకం పోయిందని.. రాజగోపాల్ రెడ్డి రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపోయారని పబ్లిక్ అనుకుంటున్నారని చెప్పారు. మూడేళ్ళుగా రాజగోపాల్ మునుగోడు ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్తున్నారని.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ కుటుంబాన్ని దత్తత తీసుకొని పదవులు ఇచ్చారని సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారుతుందంటే.. తెలంగాణ అంశమే లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఇదే సమయంలో.. అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడులో కాంగ్రెస్ ప్రచారం బాగుందన్నారు. అందరికంటే ముందుగా తామే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశామన్నారు. స్రవంతి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కొందరు నేతలు భారత్ జోడో యాత్ర ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఎక్కడుంది? కళ్లు మూసుకుని ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కళ్లు తెరవకపోతే.. పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. వివక్షాలు కామెంట్స్ చేస్తున్నట్టు.. కాంగ్రెస్ పార్టీ వెనుక పడలేదని, ప్రజల మనసులోనే ఉందని అన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ ఏం చేశాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చినప్పుడు.. పాదాభివందనం చేయడంలో తప్పు లేదని వెల్లడించారు.