మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రధాన్యత లేదని, కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాద లేదని ఆయన అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి నందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల సబ్సిడీ తగ్గించారు.
పంటలకు మద్దతు ధర తెస్తారని ఆశించామని ఆయన అన్నారు. రైతుల పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించలేదని, కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని ఆయన అన్నారు.
గోధుమలు, వరికి కొనుగోళ్లకు నిధులు తగ్గించారని, ఉపాధిహామీ పధకానికి నిధులు తగ్గించారని, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయలేదు… పంట పెట్టుబడి రెండింతలయ్యేలా ఎరువుల సబ్సిడీ తగ్గించారు అని ఆయన మండిపడ్డారు. జిఎస్టీ విధానంలో మార్పులు చేయలేదు.. ఉద్యోగస్తుల కోసం ఎటువంటి నిర్ణయాలు బడ్జెట్ లో లేవు.. వైద్య మౌలిక వసతుల కోసం నిధుల కేటాయింపులు లేవు.. కరోనా ప్రభావం చూసాక కూడా పేదలకు వైద్యం అందించే చర్యలకు కేటాయింపులు లేవు అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి వచ్చిందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు,ఆరోగ్యం ఎవరికి ఉపయోగ పడే నిర్ణయాలు లేవని ఆయన అన్నారు.