కాంగ్రెస్..కిసాన్ కాంగ్రెస్ కలిసి కార్యాచరణ చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 5న సివిల్ సప్లయ్ మంత్రిని కలుస్తామని, వరి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరుతామని ఆయన వెల్లడించారు. 6న మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. శాసన సభలో రైతుల అంశాన్ని… షార్ట్ డిస్కషన్ కోసం ప్రయత్నం చేస్తామని, గవర్నర్ ని కలిసి వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వంకి దిశా నిర్దేశం చేయాలని కోరుతామన్నారు.
13న కొల్లాపూర్ లో సభ – రైతుల డిమాండ్ ల పై తీర్మానం చేస్తామని పేర్కొన్నారు. 14 నుండి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, కేంద్రం మీద ఒత్తిడి పెంచుతామని తెలిపారు. 20న ఎల్లారెడ్డిలో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణను కేసీఆర్ రియల్ ఎస్టేట్ గా మార్చారని, వ్యవసాయం.. చేయకుండా రియర్ ఎస్టేట్ చేస్తూ రైతులను కేసీఆర్ హత్య చేస్తున్నారని ఆరోపించారు. రైతులను అదుకునే పని లోనే కాంగ్రెస్ ఉంటుందని, కేసీఆర్ రైతులను వంచించే పనిని అడ్డుకుంటామన్నారు.