CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..

  • కేసీఆర్‌పై రేవంత్ ఫైర్
  • మోదీ, బీజేపీపై విమర్శలు
  • ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
  • ఇచ్చిన మాట నిలబెడతానన్న సీఎం
Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : శిల్పకళావేదిక వేదికగా జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకుల తీరును ఎండగడుతూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బకాసురుడిని తీసుకెళ్లి ఫార్మ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “ఆయన అన్నీ మీకే చేశాడని, మళ్లీ అధికారంలోకి రావాలని అంటున్నాడు. అసలు మనకేం చేశాడు? మళ్లీ ఎందుకు వస్తాడు?” అని సీఎం ప్రశ్నించారు. గత పదేళ్లలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌లను పూర్తిగా పక్కనపెట్టేసి, రాష్ట్రంలో ‘డ్రింకింగ్ కల్చర్’ (మద్యం సంస్కృతి) తీసుకువచ్చారని మండిపడ్డారు.

మోదీ ఉద్యోగాలు ఇచ్చింది కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకే

ఇదే వేదికపై నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై కూడా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ, ఆ ఉద్యోగాలు ఎవరికిచ్చారని నిలదీశారు. ఇక్కడ ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయని, వారు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. “అక్కడ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కాబట్టి మీ పప్పులు ఉడికాయి. బెంగాల్‌లో గెలవడానికి మీకు 15 ఏళ్లు పట్టింది. కానీ ఇక్కడికి మీరా వచ్చేది? ఇక్కడ మావాళ్లు ఉన్నారు, దంచి కొడతారు” అంటూ తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు.

ఫోన్లు ట్యాప్ చేసిన సిగ్గుమాలిన బతుకు.. నీ అయ్యా జాగీరా?

బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “దిగిపోవడానికి ఇది నీ అయ్యా జాగీరా? మేము మీకేం బానిసలం కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రైతులను వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్, ఆయన మాత్రం ఫార్మ్‌హౌస్‌లో వడ్లు పండించి ఏకంగా 4200 క్వింటాళ్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా విన్న చరిత్ర కేసీఆర్‌దని, ఇంతకంటే సిగ్గుమాలిన బతుకు ఇంకేముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అబద్ధాలు చెప్పను.. చెప్పింది చేస్తా

రాష్ట్రంలో కొత్త సంసారాన్ని (ప్రభుత్వాన్ని) సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుందని, అలాగని సంసారాన్ని నడిబజారులో పెట్టుకోలేమని సీఎం పేర్కొన్నారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, కేవలం ఇచ్చిన మాటే శాశ్వతంగా ఉంటుందని.. నాడు ఇందిరమ్మ, ఎన్టీఆర్ లాంటి మహానాయకులే ఓడిపోయారని గుర్తుచేశారు. “నేను అబద్ధాలు చెప్పను, చెప్పింది చేసి తీరుతా. ప్రజలకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్లే చెప్తాను” అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలది, రైతులది, ఆడబిడ్డలది అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ లాంటి తప్పుడు పనులు తాను ఎప్పటికీ చేయనని చెప్తూ.. “ఆ పశుపతిని (కేసీఆర్‌ను) నీ ఫార్మ్‌హౌస్‌లోనే బంధించాను, ఇక బయటకు రానిచ్చే ప్రసక్తే లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.