మంచిర్యాలలో రెమ్‌డెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బాధితుల వీక్ నెస్‌ను క్యాష్ చేసుకుంటూ మంచిర్యాలలోని రెండు ప్రైవేట్ దవాఖానలకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ యజమానులు ఒక గ్రూపుగా ఏర్పడి నెల రోజులుగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కో ఇంజక్షన్ ను రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.