రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, మరి తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి ఉప్పుడు బియ్యమని, దొడ్డు బియ్యం అని, రా రైస్ అని ఎందుకు వంకలు పెడుతున్నారని విమర్శించారు. పంజాబ్ వడ్లు ఎలా తియ్యగైనయని, తెలంగాణ వడ్లు చేదెందుకైనవని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. ఉప్పుడు బియ్యం మొదలు పెట్టిందే ఎఫ్‌సీఐ అని తెలిపారు. బీజేపీని గ్రామ గ్రామాన తరిమికొట్టాలన్నారు.
వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అయితే కేంద్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల ధాన్యానికే టార్గెట్‌గా పెట్టిందన్నారు. ఎఫ్‌సీఐ వెంటనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వానాకాలం, యాసంగి ధాన్యాన్ని తీసుకుంటారా లేదా స్పష్టంగా చెప్పాలన్నారు. పంజాబ్, బీహార్‌లో ఎఫ్‌సీఐ నేరుగా రైతుల నుంచి ధాన్యం కొంటున్నదని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొని బియ్యం పట్టించి కేంద్రానికి ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు నోరు విప్పడం లేదని విమర్శించారు. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు రాజకీయం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.