పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5కిలో మీటర్ల ఎత్తులో ఉంది. అటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నేడు రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.