రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో.. బిచ్కుంద, నాగిరెడ్డి పెట, బాన్స్ వాడ, ఎడపల్లిలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిన ముద్దైంది. అకాల వర్షంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. పాఠన్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం భారీ నష్టాన్ని కలిగించింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
నిజమాబాద్ లో 7 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. కామారెడ్డి జిల్లా బిబిపేటలో అత్యధికంగా 8 సెంటిమీటర్ల వర్షపాతం నెలకొంది.
ఇక హైదరాబాద్ నగరంలోనూ సోమవారం తెల్లవారుజామున స్వల్పంగా వర్షం కురిసింది. ఈ వర్షంతో నగరం కాస్త చల్లబడింది. గత రెండు రోజుల నుంచి నగరంలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. చల్లని గాలులు వీస్తుండటంతో హైదరాబాదీలు వెదర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
జూన్ 8లోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని తెలిపింది. జూన్ 8లోగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది.