తెలంగాణలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాయి ఆ పార్టీ శ్రేణులు.. కొన్ని ప్రాంతాల్లో ఊహించినదానికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా చెబుతున్నారు. అయితే, అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. కొంత మంది సీనియర్లు అలకబూనారు.. కొందరు తిరిగి లైన్‌లోకి వచ్చినట్టే కనిపిస్తున్నా.. కొందరు చేజారి పోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో.. తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. ఈ మధ్య ఢిల్లీలో ఓ సమావేశం జరగగా.. ఎల్లుండి రాహుల్ గాంధీతో మరోసారి భేటీ కాబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు..
Read Also: KCR: సంతృప్తిగా ఉంది.. సర్వ జనులకు సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలి..
రాహుల్ గాంధీతో జరిగే సమావేశానికి మాజీ మంత్రులను కూడా పిలవాలని ఏఐసీసీ నిర్ణయించింది. పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులతో రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు.. ఇక, ఈ సమావేశానికి మరో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఎందుకంటే.. రాజకీయ వ్యూహకర్త సునీల్ హాజరుకాబోతున్నారు.. ఇప్పటికే తెలంగాణలోని వివిధ జిల్లాలు.. నియోజకవర్గాల్లో రాజకీయ వ్యూహకర్త సునీల్ టీమ్ కొంత వర్క్ చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆ గ్రౌండ్ రిపోర్ట్ నివేదికలతో సమావేశానికి హాజరుకాబోతున్నారు సునీల్… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా సునీల్, పార్టీ నేతలంతా పూర్తిగా సహకరించాలని, సునీల్ వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారంలోకి దిగాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు చెప్పనున్నారని తెలుస్తోంది. సునీల్ కనుగోలుతో రాహుల్ నుంచి తెలంగాణలోని కీలక నేతలంతా ఒకసారి సమావేశం కానుండడంతో.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అటు బీజేపీ సర్కార్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేయాల్సిన ఉద్యమాలు, ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ, బహిరంగ సభల నిర్వహణ.. ఇలా అన్నింటిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.