Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గురువారం భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 18న ములుగు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర నిన్న రాత్రి భూపాలపల్లికి చేరుకుంది. రాహుల్ గాంధీ భూపాలపల్లిలోని జెన్ కో అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఈరోజు ఉదయం భూపాలపల్లిలోని కేటీకే ఐదో గని నుంచి బొమ్మ గడ్డ వరకు నిరుద్యోగులతో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది.
అంబేద్కర్ సెంటర్‌లో రాహుల్ గాంధీ కొద్దిసేపు స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత రెండో రోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. తొలి విడత బస్సు యాత్ర రేపటితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కర్నాటక ఫార్ములాను ఆ పార్టీ తెలంగాణలో అమలు చేయనుంది. పార్టీ నేతలంతా ఒక్కటయ్యారనే సంకేతం ఇచ్చేందుకు కాంగ్రెస్ బస్సుయాత్ర చేపట్టింది.