మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే మదన్ రెడ్డిని చుట్టుముట్టిన మహిళలు నిరసన తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నర్సాపూర్‌లోని కోర్టుభవనం కూలి పోయింది. దీంతో కార్యకలాపాలు ఆగిపోయాయి. కోర్టు భవనాన్ని ICDS భవనంలోకి మార్చేందుకు పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే మదన్ రెడ్డిని అడ్డుకున్నారు మహిళలు. ICDS భవనాన్ని కోర్టుకు ఇవ్వొద్దంటూ ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు మహిళలు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చేసేదేం లేక అక్కడినించి బయటపడడానికి తంటాలు పడ్డారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. చివరకు మహిళా పోలీసుల సహకారంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశారు మదన్ రెడ్డి. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలకు మున్సిఫ్ కోర్టు ప్రధాన హాల్ గోడ కూలిపోయింది. రాత్రి సమయంలో కోర్టు గోడ కూలడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఉదయం గోడకూలినట్టయితే న్యాయవాదులు, ప్రజలకు ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు అన్నారు.
జనం లేనప్పుడు గోడ కూలడంతో న్యాయవాదులతో పాటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. 35 సంవత్సరాల కింద నిర్మించిన భవనం అయినందున ఆ భవనం శిథిలావస్థకు చేరింది. ఈ విషయమై హై కోర్ట్ జడ్జి దృష్టికి గత ఆరు నెలల కిందట తీసుకువెళ్లిన పట్టించుకోలేదని న్యాయవాదులు తెలిపా. గోడ కూలడంతో భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కోర్టు ద్వారా న్యాయ సేవలను నిలిపివేశారు. తాత్కాలికంగా భవనం ఏర్పాటు చేస్తే న్యాయ సేవలు ప్రారంభిస్తామని న్యాయవాదులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జడ్జి అనిత శుక్రవారం ఉదయం కోర్టు వద్దకు వచ్చి కూలిన గోడను పరిశీలించారు. కోర్టుని ఐసీడీఎస్ భవనంలోకి మార్చాలని భావించినా, మహిళలు ససేమిరా అంటున్నారు.