తనని తాను విష్ణువుగా ప్రకటించుకున్న అనంత విష్ణు ప్రభు అలియాస్ రామ్‌దాస్‌పై హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 290,341 కింద పబ్లిక్ న్యూసెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్ట్రాక్షన్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. అలాగే.. అతను పెట్టిన జై మహా భారత్ పార్టీ రిజిస్టర్‌పై కూడా సైఫాబాద్ పోలీసులు ఈసీకి లేఖ రాశారు. ఇళ్ల స్థలాల మాటున భారీఎత్తున ఆధార్ కార్డులు సేకరించడంపై ఈ కేసులు నమోదు చేసినట్టు తేలింది. విచారణ తర్వాత రామ్‌దాస్‌పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మీడియాలో వరుస కథనాలొస్తున్న తరుణంలో రామ్‌దాస్ పారిపోయాడు.
ఇదిలావుండగా.. ఉచిత ఇళ్ల స్థలాల పేరుతో రామ్‌దాస్ ఇప్పటివరకూ 5 లక్షలకు పైగా ఆధార్ కార్డుల్ని సేకరించినట్టు తెలిసింది. 10 రూపాయలకే పార్టీ సభ్యత్వం ఇస్తామని, మెంబర్షిప్ తీసుకున్న వారికి ఉచితంగా ఇళ్ల స్థలాలిస్తామని అతడు ఆఫర్ చేశాడు. అయితే.. ఆధార్ కార్డ్ ఇచ్చిన వారికి మాత్రమే పార్టీ సభ్యత్వం దొరుకుతుందని చెప్పాడు. ఎందుకని ప్రశ్నించకుండా.. ఉచితంగా ఇళ్ల స్థలాలు వస్తాయన్న ఉద్దేశంతో మహిళలు ఆధార్ కార్డులతో పోటెత్తారు. ఆధార్ కార్డులు సేకరిస్తుండడంతో.. దాని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఇలా రంగంలోకి దిగారు. అతడు పెట్టిన జై మహా భారత్ పార్టీ వెనుక ఏయే రహస్యాలు దాగి ఉన్నాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. బుక్కారం గ్రామస్తులు మాత్రం చిన్నతనం నుంచే సేవా స్ఫూర్తితో రామ్‌దాస్ పని చేస్తున్నాడని చెప్తున్నారు. కానీ, ప్రస్తుతం ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడన్న దానిపై మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. రామ్‌దాస్ పరారీలో ఉండడంతో.. జై మహా భారత్ పార్టీ కార్యకర్తలు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వెంటనే ఈ ఫేక్ బాబా కథకు చెక్ పెట్టే దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.