రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఘట్‌కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. మరోవైపు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి.. పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులకు రోజు ఇదో పని అయిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిన్న బాసర వెళ్తే అక్కడ కూడా అడ్డుకున్నారని.. నేడు ఇక్కడ అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను ప్రస్తుతం తన పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోనే ఉన్నానని.. ఇక్కడ తిరిగేందుకు తనకు స్వేచ్చ లేదా..? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులుకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే పోలీసులు బలవంతంగా రేవంత్ రెడ్డిని వారి వాహనంలో ఎక్కించి.. అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిన కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్ వెళ్తున్నట్టుగా చెప్పారు. ఏఐసీసీ ఆదేశాలతో తాను వరంగల్ వెళ్తున్నానని తెలిపారు. రాకేష్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే వరంగల్ వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు.. ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ సమీపంలో అడ్డుకున్నారు.