AP VS Telangana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించిన పోలవరం-నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి వివాదానికి కారణమైంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, దీనిని ఏ విధంగానైనా అడ్డుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా, ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ న్యాయ పోరాటం కోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని ప్రభుత్వం అభ్యర్థించింది. దీనికి సంబంధించి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు-సెక్రటరీ రాహుల్ బొజ్జ, అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ప్రాజెక్టు ప్రతిపాదనలు, అలాగే ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను వివరించనున్నారు.
Messi vs Revanth Reddy : మినిట్ టూ మినిట్ మ్యాచ్ అప్డేట్స్ ఇలా..!
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా లేవనెత్తుతున్న అభ్యంతరం ఏమిటంటే, ఈ పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ గతంలో తాము అడ్డుకున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టునే పేరు మార్చి మళ్లీ తెరపైకి తీసుకొచ్చారనేది. ఒకవైపు నదీ జలాల పంపకాల విషయంలో ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నప్పుడు, మరోవైపు అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో, కేవలం వరద జలాలను వృథా కాకుండా ఆపుతామనే పేరుతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన చేయడం సరైంది కాదని తెలంగాణ వాదిస్తోంది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నాలను కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ భావిస్తోంది.
న్యాయ పోరాటంతో పాటు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖతో పాటు కేంద్ర హోమ్ శాఖకు కూడా ఈ అంశంపై లేఖలు రాసింది. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రాజెక్టును నిలిపివేయకపోతే, తప్పనిసరిగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, తాము కేవలం సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీరు ద్వారానే ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదన చేశామని, దీనికి సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) కూడా సిద్ధం చేస్తున్నామని చెబుతోంది. ఏదేమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం జరగకుండా చూసేందుకే తమ ప్రయత్నాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవసరమైతే మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.