తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్.
తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే నూక వస్తుంది. ధాన్యాన్నే కొనుగోలు చేయాలి. బియ్యాన్ని సరఫరా చేయలేం…అది సాధ్యం కాదన్నారు ప్రశాంత్ రెడ్డి. వరిధాన్యాన్ని కొనాల్సిందేనని పట్టుబట్టారు మంత్రి. “ఏది అమ్ముడుబోతుందో దాన్నే కొంటాం. తెలంగాణ బియ్యాన్ని ఇస్తే కొనుగోలు చేస్తామే కానీ…..ధాన్యాన్ని మాత్రం కేంద్రం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. రాష్ట్రమే కొనుగోలు చేయాలని సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి గోయల్.
కేంద్రానికే సాధ్యం కాకపోతే, రాష్ట్రానికి ఆ శక్తి సామర్ధ్యాలుంటాయన్నారు ప్రశాంత్ రెడ్డి. “మీరు ఏదోలా ఈ సమస్య ను పరిష్కరించాలి” అని కోరారు. ప్రశాంత్ రెడ్డి. “కేంద్రం కొనలేదు…తెలంగాణ ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలకు ఈ యాసంగి బియ్యాన్ని తినే విధంగా ప్రోత్సాహించాలి, అలవాటు చేయాలి” అన్నారు గోయల్. “ధాన్య సేకరణ విధానాన్ని మార్చాలని” గట్టిగా డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విధానాన్ని మార్చుకోండి అని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. మీకూ ఒకప్పుడు ఇద్దరే పార్లమెంట్ సభ్యులున్నారు. భగవంతుడి దయతలిస్తే, మేము కూడా అధికారంలోకి వస్తాం….అది సాధ్యమే అంటూ తిరిగి బదులిచ్చారు ప్రశాంత్ రెడ్డి.