Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు, ఈ వ్యవహారంలో హరీష్‌రావు ప్రమేయంపై ఆరా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయనకు విచారణకు రావాల్సిందిగా అధికారికంగా ఆదేశాలు పంపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్‌రావుకు ఉన్న సమాచారం లేదా ప్రమేయంపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, హరీష్‌రావు రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా కేసు తదుపరి గమనం మారుతుందని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, , పలువురు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ.
ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ (SIB) మాజీ అధికారులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. వారి విచారణలో రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతూ ఒక్కొక్కరినీ విచారణకు పిలుస్తోంది. హరీష్‌రావు వంటి కీలక నేతకు నోటీసులు రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తుండగా, చట్టప్రకారం విచారణ జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.