రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావును ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆయన నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు హరీష్‌రావును సుమారు 4 గంటలగా విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం కార్యకలాపాలు, పార్టీ పరంగా వచ్చిన సమాచారం వంటి అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. హరీష్‌రావు విచారణకు హాజరవుతున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ (BRS) నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విచారణ ముగిసే సమయానికి స్టేషన్ పరిసరాలు పార్టీ శ్రేణులతో నిండిపోయాయి. పోలీసులు స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు చేసిన నినాదాలతో జూబ్లీహిల్స్ ప్రాంతం హోరెత్తిపోయింది.
AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బెయిల్.. అయినా జైలులోనే..!