Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
- 45 ఏళ్ల అజ్ఞాత జీవితం ముగించిన పసునూరి నరహరి
- దంపతులకు రూ.45 లక్షల రివార్డు చెక్కులు
- సాయుధ పోరాటంపై కీలక వ్యాఖ్యలు చేసిన నరహరి
- అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు డీజీపీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pasunuri Narahari Surrender : భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కేంద్ర కమిటీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ, పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇంచార్జ్ పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అలియాస్ విశ్వనాథ్ (64) తన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదరి ధనమ్మ అలియాస్ లత అలియాస్ పూనమ్ (55)తో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మే 12న రహస్యంగా లొంగిపోయిన ఈ దంపతులను మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పునరావాస పద్ధతుల ప్రకారం నరహరికి రూ. 25 లక్షలు, ధనమ్మకు రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 45 లక్షల రివార్డు చెక్కులను డీజీపీ ఈ సందర్భంగా అందజేశారు.
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 1982లో విద్యార్థి దశలోనే ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) సిద్ధాంతాలకు ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీలో అత్యంత ప్రమాదకరమైన ‘టెక్నికల్ వింగ్’, ఆయుధాల తయారీ, రాకెట్ లాంచర్లు, బూబీ ట్రాప్స్ అమర్చడంలో నిపుణుడిగా ఆయన గుర్తింపు పొందారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
ఆయుధ పోరాటం కష్టంగా మారింది: పసునూరి నరహరి
మీడియా సమావేశంలో లొంగిపోయిన అగ్రనేత నరహరి మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి అడుగుపెట్టేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్, తెలంగాణతో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాయుధ పోరాటం వల్ల తీవ్ర నష్టాలను చూశామని, ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టుల సాయుధ పోరాటం అత్యంత కష్టతరంగా మారిందని ఆయన అంగీకరించారు.
తెలంగాణ ప్రభుత్వం కల్పించిన పునరావాస అవకాశాలు, లొంగిపోయిన వారికి ఇస్తున్న ప్రాధాన్యతను చూశాకే తాము ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లోని పిల్గ్రిమ్ బ్యూరో (PB) సభ్యులు, అలాగే కేంద్ర కమిటీ మెంబర్ మిసిర్ బెస్రా (బిశ్రా) అనుమతితోనే తాము అడవుల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధన ఇకపై చట్టబద్ధమైన మార్గంలోనే జరగాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని, వృద్ధాప్యం , అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిని సైతం అజ్ఞాతాన్ని వీడి ప్రజా జీవితంలోకి రావాలని నరహరి కోరారు.
దేశవ్యాప్తంగా అజ్ఞాతంలో ఉన్నది 47 మందే: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి క్రమంగా అంతరిస్తోందని, ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 47 మంది అగ్రనేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయని చెప్పారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ నుండి 15 మంది, ఒడిశా 15, జార్ఖండ్ 13 మంది ఉండగా, తెలంగాణకు చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు మాత్రమే ఉన్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ఆపరేషన్ కగార్ ఫలితంగా 2024 నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 822 మంది మావోయిస్టు కేడర్ జనజీవన స్రవంతిలో కలిశారని, 334 అత్యాధునిక ఆయుధాలతో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని తెలిపారు. ఇటీవల ఒడిశాకు చెందిన కొందరు మావోయిస్టులు ఇక్కడ లొంగిపోగా, వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వ పునరావాసం కోసం అక్కడి అధికారులకు అప్పగించామని చెప్పారు.
త్వరలోనే మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టుల స్వగ్రామాలకు స్వయంగా వెళ్లి వారి కుటుంబాలను కలుస్తానని డీజీపీ ప్రకటించారు. ఇదే వేదికగా తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ మాజీ అధినేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న జేడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగులు లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ బహిరంగ విజ్ఞప్తి చేశారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న వారు లొంగిపోతే ప్రభుత్వం తరఫున అత్యుత్తమ వైద్య సదుపాయాలు, పూర్తి బెనిఫిట్స్, మెరుగైన పునరావాసం కల్పించి ప్రజా జీవితంలో గౌరవంగా బతికేలా పూర్తి భరోసా ఇస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!