ఆమెకు చెట్లు పెంచడం మాత్రమే తెలుసు.. ప్రకృతితో మమేకం కావడమే ఆమె జీవితం.. అందుకే ఈ దేశం ఆమెను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు, 2016లో బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్క స్థానం దక్కించుకున్నారు. అంతటి మహానుభావురాలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న ప్రకృతి సేవకు తరించి, ఆయన్ను ఆశీర్వదించడానికి హైదరాబాద్‌కు వచ్చారు.
జోగినిపల్లి మనసారా ఆశీర్వదించిన తిమ్మక్క.. తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన్ను ప్రశంసించింది. ఆనాటి కాలంలో తాను, తన భర్త మాత్రమే మొక్కలు నాటేవాళ్ళమని, అప్పట్లో ఇంత సౌకర్యాలు లేకపోవడం వల్ల ఊరిదాటి వెళ్ళేవాళ్ళ కాదని చెప్పారు. ఇప్పుడు డబ్బు, సౌకర్యాలున్నా.. మనుషుల్లో ప్రకృతిపై ప్రేమ తగ్గిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఎక్కడో ఒక చోట చెట్లంటే ప్రేమున్నవాళ్ళు ఉంటారని, అందుకు జోగినిపల్లి నిదర్శనమని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో జోగినిపల్లి చేస్తోన్న వృక్ష సేవ కోట్ల మందికి చేరడం అద్భుతమన్నారు. అనుభవించడానికి అన్నీ ఉన్నా.. చెట్లపైన జోగినిపల్లికి ఉన్న ప్రేమ తన హృదయానికి తాకిందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఎన్ని ఇబ్బందులున్నా చెట్ల నాటే కార్యక్రమాన్ని ఆపొద్దని జోగినిపల్లి దగ్గర మాట తీసుకున్న తిమ్మక్క.. తన 111వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 28న “తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్” ఈ సంవత్సరం జోగినిపల్లికి అందిస్తున్నట్టు తిమ్మక్క తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి ప్రగతి భవన్‌లో మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ప్రముఖ కవి జూలూరీ గౌరీశంకర్ రాసిన “ఆకుపచ్చని వీలునామా” పుస్తకాన్ని ఆవిష్కరించారు.