హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి నిర్వాహకులు శుభవార్త అందించారు. జనవరి 1నుంచి 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ తమిళిసై నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని ఆరు ఎకరాల్లో 1500 స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. నో మాస్క్ నో ఎంట్రీ రూల్‌ను అమలు చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
Read Also: సమోవా దీవిలో న్యూ ఇయర్ వేడుకలు
నుమాయిష్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తారని… ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ ఇంఛార్జ్ డీసీపీ వెల్లడించారు. ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. కాగా నుమాయిష్ సందర్భంగా ఎగ్జిబిషన్‌కు వచ్చేవారి కోసం ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని 20 ఎకరాల్లో 6 ఎకరాలనే నుమాయిష్ కోసం వినియోగిస్తుండగా.. మిగతా స్థలాన్ని సందర్శకులకు ఆహ్లాదం కలిగించేందుకు వాడుతున్నారు.