చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో రాత్రి మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న ఆ మార్చురీ సిబ్బంది రాజు రూ.1000 ఇస్తేనే మృతదేహాన్నీ తీసుకుంటానని పోలీసులకు, బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే.
అందరూ కలిసి ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు ఆప్రబుద్దుడు. దీంతో గంటల పాటు మార్చురీ ముందే శవంతో వేచి వుండే పరిస్థితి ఏర్పడింది. కుటుంబంలోని వ్యక్తి మృతితో కన్నీరు కారుస్తున్న కుటుంబాలనుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో..స్థానికులు మండిపడ్డారు.
ఎన్టీవీ ఎఫెక్ట్ :
ఎన్టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. ఉస్మానియా మార్చురీలో జరుగుతున్న అవినీతి భాగోతాన్ని అంతా కళ్లకు కట్టినట్టుగా వివరించింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఉస్మానియా మార్చురీ సిబ్బంది పై వేటు వేశారు. హుటా హుటిన ఉస్మానియాకు చేరుకుని సిబ్బంది రాజుని అదుపులో తీసుకున్నారు అప్జల్ గంజ్ పోలీసులు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తామన్నారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అప్జల్ గంజ్ పోలీసులు వివరించారు. ఎవరైనా సరే అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇప్పటికైనా మార్చురీ సిబ్బంది తమ విధులను న్యాయంగా నిర్వర్తించాలని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.