తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో వానాకాలం పంటలపై ఈసారి ఎలాంటి ఆంక్షలు విధించబోమన్నారు. వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా వుంటాయని మంత్రి తెలిపారు. రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వానకాలం పంటలపై ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరిపై ఆంక్షలు లేవని, లాభసాటి పంటలు పండించేలా రైతులకు సూచిస్తామన్నారు.
ఈ ఏడాది వరి పంట విషయంలో సంక్షోభానికి కేంద్రం కారణమన్నారు. వరి విషయంలో బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకుపోవడం కాకుండా, మార్కెట్టే రైతు కల్లం వద్దకు రావాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కొందరు స్వార్థపరులు ప్రభుత్వ లక్ష్యాన్ని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెట్టడం వల్లే ఆ సీజన్‌లో ఇతర పంటలు వేయాలని సూచించినట్టు తెలిపారు.
వరికి ప్రత్యామ్నాయం ఏంటో ఆలోచించాలన్నారు. వరితో పోల్చితే పత్తి, కంది, పెసర్లు, మినుము, కూరగాయల సాగు వంటి ఇతర పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతోపాటు మద్దతుకు మించి ధర పలుకుతుందని వివరించారు. పత్తికి మద్దతు ధర రూ. 5,726 ఉంటే మార్కెట్లో రూ.12 వేలకు పైగా అమ్ముడుపోతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పెసర్లకు మద్దతు ధర రూ.7,275 ఉంటే మార్కెట్లో రూ. 7,600 వరకు ధర పలికిందని వివరించారు.రైతుల్ని మోసం చేసే పార్టీల మాట వినకుండా.. రైతులకు మేలు చేసే పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మాలన్నారు.
Read Also: Health News: ఏసీలో కూర్చున్నవారికి పైల్స్ వస్తాయా?