వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, “కోఆపరేటివ్ ఫెడలరిజమ్” కాదు…సెలెక్టివ్ ఫెడలరిజమ్ అంటూ విమర్శించారు. వారికి నచ్చింది చెయ్యడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందన్నారు.
గోడౌన్లు, రైళ్లు, ఎగుమతుల పై అనుమతులు ఇచ్చే అధికారం కేంద్రం వద్ద పెట్టుకుని, ఆపద వచ్చినప్పడు రాష్ట్రాలను పట్టించుకోమంటే ఎలా.. అంటూ ప్రశ్నించారు. దేశానికి అవసరమైన పప్పు గింజలు, నూనెగింజలను పండించుకునే ముందు చూపు లేని కేంద్రప్రభుత్వం ఏం ప్రభుత్వమని అంటూ నిలదీశారు. దేశ అవసరాలను తీర్చే విధంగా, స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన దేశభక్తి అని మంత్రి అన్నారు. దేశభక్తి పై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, హృదయం కూడా విశాలంగా ఉండాలని మంత్రి అన్నారు.
కేంద్రానిదే తప్పు అని నిరూపించగలిగాం: ఎర్రబెల్లి దయాకర్‌రావు
అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కేంద్ర మంత్రి తో మాట్లాడిన తర్వాత తప్పు కేంద్రానిదే అని నిరూపించగలిగాం. మాకు తెలియకుండా కేంద్రం లిఖితపూర్వక హామీ ఇస్తుందా అని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారని మంత్రి అన్నారు. రెండు రోజుల్లో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారని ఎర్రబెల్లి అన్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ కేంద్ర మంత్రి లిఖిత పూర్వక హమీ ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టబోమన్నారు. రైతుల నుంచి రాష్ర్టం కొన్న ధాన్యాన్ని ఇండియా గేట్ వద్దకు తీసుకొచ్చి పోస్తామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.