BC Degree Gurukulalu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 17 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. అయితే ఇవి జనరల్ డిగ్రీ కాలేజీలు కాదు. ఈ ఏడాది కొత్తగా 17 బీసీ గురుకులాలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీలతో ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటయింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న డిగ్రీ కాలేజీల్లో 16,320 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటైన గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 327 బీసీ గురుకులాలు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సమగ్ర అభివ్రుద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా మరో 17 బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో కేవలం 19 బిసి గురుకులాలు మాత్రమే ఉండేవని.. వాటిలోనూ అరకొర వసతులతో ఉండేవని గుర్తు చేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 19ని కాస్త నేడు 327కు పెంచుకున్నామన్నారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కేసీఆర్.. అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. కేవలం బిసి గురుకులాల ద్వారానే రాష్ట్రంలో సుమారు 2లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తారని ఆనందం వ్యక్తం చేశారు.
Read also: El Nino: ప్రాణాంతక వైరస్‌ల ప్రమాదం.. కారణం ఎల్ నినో.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
గత ఏడాది 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసుకొని క్లాసులు ప్రారంభించుకున్నామని .. వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభించే 17 డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి లబ్దీ చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తామన్నారు మంత్రి గంగుల. కొత్తగా ఏర్పాటు కానున్న డిగ్రీకాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బిసి గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటవుతుందన్నారు. 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభించబోయే బిసి డిగ్రీ గురుకులాల్ని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కొమరంబీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.