కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు బెయిల్ రాక ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా రజినీ అనే వాటాదారు కార్వీ ఆస్తులు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ (NCLT) విచారణ జరిపింది.
Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో వీడిన మిస్టరీ
ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన లెక్కలు సరిగ్గా లేవని, వీటి అమ్మకాల వల్ల ఇన్వెస్టర్లు నష్టపోతారంటూ రజినీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దాంతో కార్వీ సంస్థ ఆస్తులేవీ అమ్మవద్దని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ అనుబంధ సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్‌సీఎల్‌టీ మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా మొత్తంగా కార్వీ సంస్థ వ్యవహారంలో రూ.1,500 కోట్ల మేర మోసం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినందున మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.