నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో తాజాగా ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. జూన్ 5న రాహుల్ గాంధీని, జూన్ 8న సోనియాగాంధీని తమ ముందు హాజరు కావాలని కోరింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డు చేసుకోనున్నారు ఈడీ అధికారులు. అయితే కాంగ్రెస్ నాయకులకు సమన్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా విమర్శించారు. గతంలో ఈ కేసులో మల్లిఖార్జున ఖర్గేను ఈడీ ప్రశ్నించింది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని తప్పు పట్టారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వాతంత్య్ర సమరయోధులు పెట్టిన సంస్థ పేరుు డ్యామేజ్ చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకు నోటిసులు ఇవ్వడాన్ని ఖండించారు. కీసరలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ లో పాల్గొన్న ఆయన రాజకీయ తీర్మానాలపై చర్చ జరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారని.. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం సమావేశాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రం దివాళా తీయడానికి కేసీఆర్ విధానాలే కారణం అని విమర్శించారు. ప్రయారీటీ లేని పనులు.. ఇబ్బడి ముబ్బడి అప్పులు సరికాదని అన్నారు. అప్రాధాన్యత పనులు చేయడం వల్లే అప్పులు అని అన్నారు.