సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి జులై 12 వరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 272.7 శాతం వర్షపాతం కురిసింది. ఇక భూపాలపల్లిలో 153, మహబూబాబాద్‌లో 147, జనగామలో 109, వరంగల్‌లో 95 , హనుమకొండలో 88 శాతం వర్షపాతం నమోదైనట్టు తేలింది. వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా ఎన్టీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగారు.
జిల్లా పరిధిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో.. 70 శాతం చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్టు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం 5241 చెరువులుండగా.. వాటిల్లో 1995 చెరువులు అగులు పోస్తున్నాయి. 1549 చెరువులో పూర్తిగా నిండాయి. రెండు, మూడు రోజుల్లో అవి కూడా అలుగు పారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 చెరువుల కట్టలు, కాలువలకు గండ్లు పడ్డాయి.
అటు.. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్‌కు వరద నీరు భారీగా పోటెత్తింది. 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. అధికారులు 17 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్ననారు. ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు అధికంగా ఉండటంతో.. ప్రాజెక్ట్ కట్ట పై నుంచి నీరు ప్రవహిస్తోంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.