సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఈ రోజు దళిత బంధు ప్రారంభమైంది. మండలంలోని బడ్డాయిపల్లి గ్రామంలోని దళితులకు దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్ లను జేసీబీలను బొలెరో వాహనాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందజేశారు. అలాగే 20 మంది లబ్ధిదారులకు డైరీ కి సంబంధించి ప్రొసిడింగ్స్ ను కూడా సందర్భంగా అందజేశారు. మర్పల్లి మార్కెట్ యాడ్ లో వైభవంగా జరిగిన దళిత బంధు వాహనాల పంపిణీలో లబ్ధిదారుల తో పాటు నియోజకవర్గంలోని నాయకులు కూడా పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించి ఇష్టమైన వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉదయం నుంచి మార్కెట్ కమిటీ లో తమ వాహనాలను ఉంచుకొని వాటి తోరణాలు కట్టి డెకరేషన్ చేసి పంపిణీ కార్యక్రమాన్ని ఒక వేడుకలా చేశారు. అంతేకాదు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను డప్పు వాయిద్యాలతో ఎదుర్కొని డ్యాన్సులు చేస్తూ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహపంక్తి భోజనాల్లో పాల్గొని అనంతరం వారికి వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆటపాటలతోనే వట్ పల్లి లో మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ట్రాక్టర్లు జేసీబీ లతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.