అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… స్పీకర్‌పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డ ఆయన.. సీనియర్ సభ్యుడిని అని చెప్పుకుంటూ… సభాపతిని మరమనిషి అని కించపరుస్తూ మాట్లాడారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సభ ఎన్ని రోజులు అనేది బీఏసీలో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం.. కానీ, సీఎం కేసిఆర్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నాడని చైర్ ను అగౌరవ పరుస్తూ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమి వ్యాఖ్యానించారు.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా స్పీకర్ పోచారానికి క్షమాపణ చెప్పాల్సిందేనని.. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు..
Read Also: Ration In Mercedes Benz Car: చాలా పూర్..! బెంజ్ కారులో రేషన్ కోసం వచ్చాడు..
ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిబంధనలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్చుకున్న సంగతి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.. వార్తల్లో ఉండటానికే ఈటల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే, మరి లోక్‌సభ స్పీకర్ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా..? అని ప్రశ్నించారు. స్పీకర్ విషయంలో మాట్లాడేముందు సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, స్పీకర్‌ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీని అవమానపరిచినట్టే అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.