Minister Srinivas Goud Gives Strong Warning BJP Over ED Raids: తెలంగాణలో జరుగుతున్న ఈడీ దాడులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మీద కక్ష్యతోనే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఈడీ సంస్థ బీజేపీకి అనుబంధంగా పని చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని కేంద్రం భావిస్తోందని ధ్వజమెత్తారు. గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని మీద ఈడీ దాడులు జరుగుతున్నాయన్న శ్రీనివాస్ గౌడ్.. ‘ఇరవై రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, మరి అక్కడ అవినీతి కనిపించడం లేదా?’ అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వని కేంద్రం.. మెడికల్ కాలేజీ పెట్టిన మల్లారెడ్డిపై దాడి చేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రశాంతంగా ఉంది కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అదనంగా మోడీ నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్ట్‌కి నిదులు ఇస్తామని చెప్పిన మోడీ.. మాట తప్పారన్నారు. ముంబై, గోవాల్లో ఉన్న క్యాసినోలను మూసివేయాలని మోడీని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని.. అందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని.. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. మత పిచ్చితో దేశంలో అభివృద్ధి చేయకుండా.. దేశాన్ని ఆగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈడీ దాడులతో తెలంగాణ ప్రజలు భయపడరని, ఈ దాడులకి ప్రతిదాడులు కచ్ఛితంగా ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ అన్ని రాష్ట్రాలకు భిన్నమని.. తెలంగాణతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా తెలంగాణ నష్టపోవాలని కేంద్రం భావిస్తోందన్నారు. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని.. ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.