టీఆర్ఎస్ అవిర్భవ దినోత్సవానికి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు, సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు వచ్చే టీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది టీఆర్ఎస్ పార్టీయేనని ఆయన అన్నారు.
ఆది నుంచి తెలంగాణకు అడ్డుపడి, కించపరిచే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న అదే రీతిని అవలంబిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణతో పోల్చితే ఏ రాష్ట్రం కూడా దరిదాపున లేదని, వట్టిమాటలు గాలి మాటలను చెప్పే పార్టీ టీఆర్ఎస్ కాదన ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించటం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడని వాళ్ళు యాత్రల పేరిట తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.