Minister Malla Reddy Sensational Comments On Congress Party: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే, చీకటి రోజులు వస్తాయంటూ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మల్‌గడి మలక్‌పేటలో నిర్వహించిన రైతు వేదిక సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని.. అమెరికాకు వెళ్లిన ఆయన అక్కడ ఎన్ఆర్‌ల వద్ద ముష్టి ఎత్తుకున్నాడని ఆరోపించారు. ఎంపీగా ఉండి కూడా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అభివృద్ధి చేయలేని రేవంత్‌రెడ్డి.. రేపు రాష్ట్రానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలు తెలియని రేవంత్.. ఉచిత విద్యుత్‌పై మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఛీ కొడతారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా నిలబడుతారని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దారని కొనియాడారు. రైతుల కష్టాల్ని సీఎం కేసీఆర్ తెలుసుకుని.. వ్యవసాయసాగుకు ఎన్నో సౌకర్యాలను కల్పించారని అన్నారు. ఆ సౌకర్యాలతో రైతులు పంటలు పండిస్తుంటే.. అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకుల కళ్లు మండుతున్నాయని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఈ సమావేశంలో తామంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని మేడ్చల్, మల్కాజిగిరి రైతులు తీర్మానం చేసి, ఆ ప్రతిని మంత్రి మల్లారెడ్డికి అందజేశారు.