మరోసారి మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పని అయిపోయిందంటూ ఆయన మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని, కాంగ్రెస్ దివాళా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ నోటిసులు వస్తే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని, డ్యూటీలో ఉన్న ఎస్సై కాలర్ ఎలా పట్టుకుంటారు? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బంది కలిగిస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌పై మా నాయకునికి పూర్తి స్థాయి స్పష్టత ఉందని, తెలంగాణలో వాళ్లకు నూకలు చెల్లవు అని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో ఉందని, బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని ఆయన వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ఐరన్ లెగ్ లు అని ఆయన విమర్శించారు.
వాళ్లిద్దరూ ఎక్కడ అగుడు పెడితే అక్కడ వర్షాలు పడవని ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ దేశంలో గుండు సున్నా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రాహుల్‌గాంధీ, సోనియా గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది.