మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనమే సృష్టించింది.. ఈ వ్యవహారంపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్పందించారు.. ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. అయితే, ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై స్పందించేందుకు నిరాకరించారు మంత్రి కేటీఆర్… ఇవాళ గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన ఆయన.. 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను కలియతిరుగుతూ.. కరోనా బాధితులను పరామర్శించి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందుతోన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత లాక్‌డౌన్ ముగిసేలోగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గే అవకాశం ఉందన్నారు. మళ్లీ సాధారణ జీవనం గడిపే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారన్న ఆయన.. కరోనా విజృంభించినప్పటి నుంచి విరామం లేకుండా వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ను ఎదుర్కొంటున్నాం.. రాబోయే రోజుల్లో ఎలాంటి ఉత్పన్నాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.. కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడదలచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు కూడా వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. కాగా, ఈటల వ్యవహారంలో టీఆర్ఎస్ నుంచి కొంత ఆచితూచే స్పందిస్తున్నారు.. కేవలం ఈటల ఆరోపణలు, విమర్శలకు మాత్రమే కౌంటర్ ఇస్తున్న నేతలు.. ఇంత కాలం మరి ఏం చేశారని నిలదీస్తున్న సంగతి తెలిసిందే.