Minister Jagadish Reddy Says Thanks To Left Parties: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికల్లో సీపీఐ, సీపీఎం తెరాస కలసి పని చేశాయని, దేశంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పని చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. బీజేపీని నిలువరించే శక్తి ఒక్క టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. తెలంగాణలో పాలన సజావుగా సాగకూడదనేదే బీజేపీ ఉద్దేశమని, అందుకే మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని విమర్శించారు. లెఫ్ట్ శ్రేణులు ప్రచారం వల్లే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఇకపై కూడా అందరం కలిసి పని చేస్తామన్నారు.
ఇదే సమయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఈ రోజు తమకు చాలా సంతోషంగా ఉందని, ఒక పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడామని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారని గుర్తు చేశారు. ఓడిపోయినప్పటికీ.. నైతికంగా తామే గెలిచామని వాళ్లు చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ని దిక్కు లేని పార్టీగా అవతరించిందని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఆల్టర్‌నేట్ పార్టీ కానే కాదని ఎద్దేవా చేశారు. మునుగోడులో ప్రభాకర్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవాలని.. అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. సాంబశివరావు చెప్పినట్టుగానే తాను అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటానని హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.