దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. దేశ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమైన పద్దతిలో పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తరువాత కూటములుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు, ప్రస్తుతం బీజేపీ పార్టీ దేశ అభివృద్ధిలో విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ దేశ భవిష్యత్తుకు సరైన ప్రణాళిక లేకపోవడమే కాకుండా..అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నప్పటికీ..ఒక్క ప్రభుత్వం కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిగా ఉపయోగించలేదని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలం అయిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం పక్కన పెడితే దేశం దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీదే అని విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు అవసరమైన విధంగా పక్కా ఎజెండాతో పార్టీ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన వెల్లడించారు.