తెలంగాణలో మేడారం జాతర కన్నుల పండువగా జరుగుతోంది. జాతర సందర్భంగా మేడారం పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం నాడు ఏరియల్ వ్యూ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగే ఈ జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరారు. ఈ విషయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
అతిపెద్ద గిరిజన జాతర అంటే మేడారం జాతర అని… గతంలో మేడారం జాతర అంటే ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొనేవి అని.. కానీ ప్రస్తుతం భారీగా నిధులు సమకూర్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు జాతర కోసం దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. మూడు నెలల నుంచే మేడారం జాతర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.