ధాన్యం కొనుగోలు సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం సేకరణపై మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. గతేడాది కన్నా 30శాతం అధికంగా ఈ సారి ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం సేకరించిన అనంతరం రైతులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లింపునకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. opmsలో నమోదైన వెంటనే రైతులకు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.5,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1280 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. రైతులపై కేంద్రం, ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరు విచారకరమని ఆయన అన్నారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతోపాటు, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కమలాకర్ అన్నారు.