మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణం అందరినీ కదలిస్తోంది.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంలో విప్లవోద్యమంలో పనిచేసిన ఆయన.. చివరకు ఆ అడవి తల్లి ఒడిలోని కన్నుమూశారు.. అయితే, ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆర్కేతో నాకు 1994 నుంచి పరిచయం ఉందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకన్న ఆయన.. వివిధ అంశాల్లో కేంద్ర కమిటీ సూచించిన డైరెక్షన్ లో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. 42 ఏళ్లుగా అనేక ప్రజ సమస్యలపై అవగాహనతో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఆర్కే అని.. మావోయిస్టు క్యాడర్ అభిమానాన్ని చూరగొన్న నాయకుడు అతడని ప్రశంసలు కురిపించారు.
1994లో ఆర్కే, నేను కలిశాం.. ఆంధ్రలో దళితుల సమస్యలపై కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు జంపన్న.. ప్రజా విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ సాకేత్ అలియాస్ ఆర్కేకు నా విప్లవ జోహర్లు అర్పిస్తున్నాను.. ఆయన మరణం విప్లవోద్యమానికి తీరని నష్టం.. మావోయిస్టు పార్టీకీ తీరని లోటు అన్నారు.. వారి కుటుంబానికి, మావోయిస్టు పార్టీకి విప్లవ జోహార్లు తెలిపిన జంపన్న.. తాను, తన కుటుంబం, తన కుమారుడు చేసిన అనేక త్యాగాలు విప్లవ మార్గదర్శకాలుగా నిలిచి తీరుతాయన్నారు. ఇక, శాంతి చర్చల కాలంలో ఆర్కే.. కేంద్ర కమిటీ సూచించిన అంశాలపై చర్చించారని.. విప్లవకారుల ఐక్యతకు పాటు పడటం అనేవి మరిచిపోలేని విషయాలన్నారు.. ఆర్కే ఓ గొప్ప నేతగా.. గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు జంపన్న.