హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ అధికారి పేరుతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మ్యాట్రీమోనీలో హరిప్రసాద్ అనే యువకుడు ఐపీఎస్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ కనిపించడంతో ఆసక్తి కనపరిచిన మహిళలను హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళకు అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపించమని అడిగింది. దీంతో హరిప్రసాద్ తన బుర్రకు పదునుపెట్టి ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేశాడు. ఈ కార్డు చూసి సదరు మహిళ నిజమే అని భావించింది.
Read Also: మిస్టరీగా మారిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్
దీంతో అప్పటి నుంచి సదరు మహిళను హరిప్రసాద్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో హరిప్రసాద్ మరికొందరు మహిళలను వేధించినట్లు స్పష్టమైంది. కాగా ఇటీవల మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై రాచకొండ షీ టీమ్స్ పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా… నాలుగు వారాల వ్యవధిలోనే 52 కేసులు నమోదు చేశారు. మహిళలను వేధించిన 56 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 24 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం. నిందితులకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే రాచకొండ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.